దేశానికి నయా అభివృద్ధి నమూనా కావాలంటూ..తాము జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించారు. మద్దతు కోసం అనేక ప్రాంతీయ పార్టీల అధినేతలను కూడా కలిశారు. కాని ఎవరి నుంచి ఆశించిన సమాధానం రాలేదని కేసీఆర్ అడుగులను బట్టి అర్థం అవుతోంది. తాము నెలకొల్పబోయే జాతీయ పార్టీకి జాతీయ స్థాయిలో మద్దతు ఇవ్వాలని కేసీఆర్ పలు పార్టీలను కోరారు. మమతా బెనర్జీ, నవీన్ పట్నాయక్ , శింబుసోరెన్, హేమంత్ సోరెన్ , ఉద్దావ్ థాక్రే, కేజ్రీవాల్ , అఖిలేష్ యాదవ్ , దేవెగౌడ, కుమారస్వామి లను కలిసి బీజేపీయేతర, కాంగ్రెస్ యేతర కూటమి ఏర్పాటుపై చర్చోపచర్చలు జరిపారు. బీజేపీయేతర పక్షాలన్ని కాంగ్రెస్ లేకుండా బీజేపీని గద్దె దించే సీన్ లేదని.. ఇలా చేస్తే బీజేపీకి ప్రయోజనం చేకూర్చిన వాళ్ళం అవుతామే తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదని కేసీఆర్ కు షాక్ ఇచ్చారు.
కూటమి ఏర్పాటు చేసి చక్రం తిప్పాలని భావించిన కేసీఆర్ కు ప్రాంతీయ పార్టీల నుంచి గట్టి షాక్ తగిలింది. ఇక, కూటమి ఏర్పాటు అయ్యే పని కాదని భావించి జాతీయ పార్టీ ఏర్పాటును ముంగిట వేసుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిని బరిలో నిలిపి… ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ద్వారా సత్తా చాటాలని భావించిన కేసీఆర్ కు మమతా బెనర్జీ గట్టి షాకే ఇచ్చారు. మమతా నేతృత్వంలో నిర్వహించిన సమావేశానికి కాంగ్రెస్ ను కూడా ఆహ్వానించారు. కాంగ్రెస్ ను సమావేశానికి ఇన్వైట్ చేయడం తమకు నచ్చలేదంటూ ఆ సమావేశానికి డుమ్మా కొట్టారు కేసీఆర్.
ఇంత కీలకమైన భేటీకి కేసీఆర్ డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అవుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ రహిత కూటమితో బీజేపీని పవర్ నుంచి దించడం సాధ్యమయ్యే పని కానే కాదు. అలాగని కేసీఆర్ నెలకొల్పబోయే పార్టీతో ఇది అసలే సాధ్యం కాదు. మరి, బీజేపీని వీక్ చేసేందుకు రాష్ట్రపతి ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తోన్న కేసీఆర్..ఈ పోరులో కాంగ్రెస్ భాగస్వామ్యాన్ని ఎందుకు ఇష్టపడటం లేదనే ప్రశ్న తెరపైకి వస్తోంది. దీంతో.. కేసీఆర్ స్ట్రాటజీ ఏంటో..? ఆయన ఎవరి కోసం పార్టీ ఏర్పాటు అంటున్నారో..? ఎవరి ప్రయోజనాల కోసం జాతీయ పార్టీ పెడుతున్నారో అర్థం కాక చెవులు కొరుక్కుంటున్నారు.