ద‌ళిత బంధుకు బ్రేక్

తెలంగాణ ప్ర‌భుత్వం హుజురాబాద్ ఉప ఎన్నిక ముందు మొద‌లుపెట్టిన ద‌ళిత బంధుకు ఎన్నిక‌ల సంఘం బ్రేక్ వేసింది. ద‌ళిత బంధు ద్వారా ఓట‌ర్లు ప్ర‌భావితం అయ్యే అవ‌కాశం ఉంద‌ని, అస‌లు ఓట్ల కోస‌మే ఈ ప‌థ‌కం మొద‌లుపెట్టార‌న్న ప్ర‌తిప‌క్షాల విమ‌ర్శ‌ల‌కు కేసీఆర్ కూడా ఔను అని స‌మాధానం చెప్ప‌టంతో ఈసీ ఈ నిర్ణ‌యం తీసుకుంద‌ని తెలుస్తోంది.

ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని హుజురాబాద్ ఉప ఎన్నిక పూర్త‌య్యే వ‌ర‌కు నిలిపివేయాల‌ని ఎన్నిక‌ల అధికారిని కేంద్రం ఎన్నిక‌ల సంఘం ఆదేశించింది.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఈనెల 30న జ‌ర‌గ‌నుంది.

ఇదిలా ఉండ‌గా ద‌ళిత బంధు ప‌థ‌కానికి రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌రో 250 కోట్లు విడుద‌ల చేసింది. రూ. 100 కోట్ల నిధులను ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం చింతకాని మండలానికి, రూ. 50 కోట్లను సూర్యాపేట జిల్లా, తుంగతుర్తి నియోజకవర్గం లోని తిర్మలగిరి మండలానికి, రూ. 50 కోట్లు నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాలలోని చారగొండ మండలానికి, రూ.50 కోట్లు కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి నిధులను విడుదల చేశారు.