తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్నా బీజేపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆరు పార్లమెంట్ స్థానాలు కైవసం చేసుకుంటుందని ఇండియా టు డే సర్వేలో వెల్లడి అయింది. ప్రస్తుతం ఉన్న నాలుగు సీట్లకు అదనంగా మరో రెండు సీట్లను కైవసం చేసుకుంటుందని సర్వేలో తేలింది. మరోవైపు..ముగ్గురు ఎంపీలు ఉన్న కాంగ్రెస్ ఓ స్థానం కోల్పోతుందని సర్వేలో వెల్లడైంది.
ఇక, ఈ సర్వే ఫలితాలు టీఆర్ఎస్ కు తీవ్ర నిరాశ కల్గించేవె అని చెప్పొచ్చు. టీఆర్ఎస్ ఎంపీల సంఖ్య 8కి మాత్రమే పరిమితం అవుతుందని పేర్కొంది. థర్డ్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లో కీరోల్ పోషించాలని భావిస్తున్న టీఆర్ఎస్ అధినేతకు ఏమాత్రం మింగుడు పడనివే. మరోవైపు బీజేపీని తీవ్రంగా వ్యతిరేకిస్తోన్న నేపథ్యంలో ఆ పార్టీకి అధిక సీట్లు రావడం టీఆర్ఎస్ ను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం కూడా లేకపోలేదు.
మరోవైపు… బెస్ట్ ముఖ్యమంత్రుల జాబితాలో కేసీఆర్ టాప్ టెన్ లో చోటు దక్కించుకోలేకపోయారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా టాప్ టెన్ జాబితాలో లేకపోవడం గమనార్హం. ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం , హుజురాబాద్ ఉప ఎన్నిక అస్త్రంగా తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై సాగదీత, ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం వహించడం వంటివి కేసీఆర్ పై వ్యతిరేకత పెరిగేందుకు కారణం అయ్యాయి. ఇక మొదటి స్థానంలో ఒరిస్సా సీఎం చోటు దక్కించుకున్నారు.