మంత్రి కేటీఆర్ పై విరుచుకుపడ్డారు ఓయూ విద్యార్ధి నేత, టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కేతూరి వెంకటేష్. కాంగ్రెస్ పని అయిపోయిందని కొల్లాపూర్ సభలో మాట్లాడిన కేటీఆర్ కు దమ్ముంటే.. హస్తం పార్టీ గుర్తుపై గెలిచిన బీరం హర్షవర్ధన్ రెడ్డితో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు సిద్దం కావాలని సవాల్ విసిరారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికలకు సిద్దమైతే ఎవరి దమ్ముంటే తెలుస్తుందంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఆ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకున్నాక కాంగ్రెస్ గురించి మాట్లాడితే బాగుంటుందని హితవు పలికారు.
“మీ అయ్యను అడుగు కాంగ్రెస్ చరిత్ర ఏంటో.. చెప్తాడు అంటూ కేటీఆర్ కు కేతూరి కౌంటర్ ఇచ్చారు. దశాబ్దాల స్వరాష్ట్ర ఆకాంక్షను కాంగ్రెస్ నెరవేర్చకపోయుంటే.. కల్వకుంట్ల కుటుంబం ఎక్కడ ఉండేదో గుర్తు చేసుకో కేటీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. మీ కుటుంబం అనుభవిస్తోన్న పదవులన్నీ కాంగ్రెస్ పెట్టిన భిక్షేనని అది తెలుసుకోకుండా కాంగ్రెస్ పైనే విమర్శలు చేస్తావా అంటూ మండిపడ్డారు కేతూరి వెంకటేష్. మరోసారి కాంగ్రెస్ పై అవాకులు చెవాకులు పేల్చితే కేటీఆర్ ను ఎక్కడికక్కడా అడ్డుకుంటామని హెచ్చరించారు. అలాగే, మంత్రులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలన్నారు. ఇష్టారీతిన మాట్లాడితే సహించేది లేదన్నారు.
కేటీఆర్ తనను తాను ఎక్కువ ఊహించుకొని మాట్లాడుతున్నాడన్నారు. రాహుల్ గాంధీది ఈ దేశం కోసం పోరాడిన కుటుంబమని.. కేటీఆర్ ది తెలంగాణను మోసం చేసిన కుటుంబమని.. అలాంటి వ్యక్తి రాహుల్ గాంధీపై ఇష్టమోచ్చినట్లు మాట్లాడితే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ తన స్థాయి తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు కేతూరి.