మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తన రాజకీయ భవిష్యత్ పై ఎటు తేల్చుకోలేకపోతున్నారు. బీజేపీలో చేరుతారా..?కాంగ్రెస్ లోకి పునరాగమనం చేస్తారా అన్న విషయంలో ఆయన క్లారిటీ ఇవ్వడం లేదు. మరోవైపు రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలకు అన్ని పార్టీలు సమయత్తం అవుతోన్న నేపథ్యంలో స్వతంత్రంగా ఉన్న కొండా మాత్రం సైలెంట్ గా ఉండటం వెనక ఆయన వ్యూహమేంటని రాజకీయ పక్షాలు కూడా చర్చించుకుంటున్నాయి.
కాంగ్రెస్ కు రాజీనామా చేసిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి గత ఏడాది జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కు మద్దతిచ్చారు. దాంతో ఈటలతో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా కొండా బీజేపీలో చేరుతారని అంత భావించారు. కాని అనుకున్నదేమి జరగలేదు. ఇక, ఇటీవల రైతులకు మద్దతుగా పరిగిలో కాంగ్రెస్ చేపట్టిన ధర్నాలో కొండా ప్రత్యక్షం కావడం చర్చనీయంశంగా మారింది. త్వరలోనే తిరిగి కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం జరిగింది. కాని కొండా ఊగిసలాటలోనే ఉండిపోయారు.
రేవంత్ కు పీసీసీ బాధ్యతలు చేపట్టాక ఆయనతో కొండా కలిసి నడుస్తారని అనుకున్నా అది జరగలేదు. ఈటల తో అనుబంధం దృష్ట్యా బీజేపీ కండువా కప్పుకుంటారని భావించిన అది జరగలేదు. ఇంతకీ ఆయన వ్యూహం ఎంటని..? రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ ను ఎదురించి నిలిచే పార్టీలోకి వెళ్తానని స్పష్టం చేసినా కొండా… టీఆర్ఎస్ అధినేతను స్వతంత్రంగానే ఎండగట్టాలని అనుకుంటున్నారా అని చర్చలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం పొలిటికల్ క్రాస్ రోడ్డులో ఉన్న కొండా దారెటు అని ఆయన క్యాడర్ సైతం ఆసక్తిగా ఎదురు చూస్తోంది.