శనివారం కొల్లాపూర్ లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. గత కొంతకాలంగా టీఆర్ఎస్ పై అసంతృప్తిగానున్న జూపల్లి కృష్ణారావు ఇంటికెళ్లడం చర్చనీయంశంగా మారింది. ముగ్గురు మంత్రులు, జిల్లాకు చెందిన బీరం హర్షవర్ధన్ రెడ్డి మినహా మిగతా ఎమ్మెల్యేలంతా జూపల్లి ఇంటికి వెళ్ళారు. దీంతో ఆయనతో మంత్రి కేటీఆర్ ఏం మాట్లాడారు..? హర్షవర్ధన్ రెడ్డితో విబేధాలను పక్కనపెట్టేసి.. పార్టీ కార్యక్రమాల్లో భాగం కావాలని సూచించారా..? ఇలా అనేక ప్రశ్నలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి.
కొల్లాపూర్ లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆ తరువాత నిర్వహించిన సభలో పాల్గొన్నారు. ఈ సభకు మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకు ఆహ్వానం అందిందో లేదో కాని ఆయన మాత్రం దూరంగానే ఉండిపోయారు. దాంతో సభ ముగియగానే కేటీఆర్ నేరుగా జూపల్లి ఇంటికి వెళ్ళారు. ఆయనతో పదిహేను నిమిషాల పాటు మంతనాలు జరిపారు. జూపల్లి – హర్షవర్ధన్ రెడ్డిల సవాళ్ళ రాజకీయం రంజుగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే జూపల్లి ఈ నెల 26న అంబేద్కర్ చౌరస్తా దగ్గర హర్షతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్దమని సవాల్ విసిరాడు. ఈ క్రమంలోనే పార్టీ పరువును బజారుకీడ్చవద్దని కేటీఆర్ హితబోధ చేశాడో లేక… వచ్చే ఎన్నికల్లో టికెట్ మీకేనని భరోసా కల్పించాడో క్లారిటీ లేదు కాని కేటీఆర్ – జూపల్లి చర్చల రాజకీయంతో కొల్లాపూర్ పాలిటిక్స్ హీటేక్కాయి.
మరోవైపు.. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరిన హర్షవర్ధన్ రెడ్డి తన వర్గీయులకు మాత్రమే పార్టీలో ప్రాధాన్యత ఇస్తున్నారని.. ముందునుంచి ఉన్న కార్యకర్తలను పట్టించుకోవడం లేదని కంప్లైంట్స్ ఉన్నాయి. మరోవైపు… గ్రూప్ రాజకీయాలతో కొల్లాపూర్ లో పార్టీ వీక్ అవుతుందని పీకే సర్వేలోనూ వెల్లడి అయినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు, హర్షపై నియోజకవర్గ ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని.. జూపల్లి కృష్ణారావుకే కాస్త అడ్వాంటేజ్ ఉందని సర్వేలో తేలడంతో.. ఆయన పార్టీ మార్పుపై ఆలోచనలో ఉన్నారని తెలియడంతో కేటీఆర్ జూపల్లిని కలిశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
అయితే.. జూపల్లిని మంత్రి కేటీఆర్ కలవడం పట్ల హర్షవర్దన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.