సొంత ఇలాకాలో రేవంత్ కు త‌ల‌నొప్పిగా కోమ‌టిరెడ్డి?

పీసీసీ చీఫ్ రాలేద‌న్న అసంతృప్తి, ఆవేశంతో ఉన్న ఎంపీ కోమ‌టిరెడ్డి… రేవంత్ రెడ్డి టార్గెట్ గా ప‌నిచేస్తున్నారా? అంటే పొలిటిక‌ల్ ఈక్వేష‌న్స్ అవున‌నే స‌మాధానం ఇస్తున్నాయి. రేవంత్ పార్టీ అధ్య‌క్షుడ‌య్యాక పార్టీలో కొత్త జోష్ వ‌చ్చింద‌నేది ఓపెన్ సీక్రెట్. వ‌రుస‌గా ఏదో ఒక కార్య‌క్ర‌మంతో పార్టీ జ‌నాల్లో నానుతుంది. కేసీఆర్ టార్గెట్ గా జిల్లా ప‌ర్య‌ట‌న‌లు, భారీ బ‌హిరంగ స‌భ‌లు పెడుతూనే ఉన్నారు. అయితే, రేవంత్ రెడ్డి దూకుడుకు కోమ‌టిరెడ్డితో పాటు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి స‌హ‌క‌రించ‌టం లేద‌న్న అభిప్రాయం పార్టీ వ‌ర్గాల్లో ఉంది.

పార్టీ బ‌లోపేతంపై దృష్టిపెట్టిన రేవంత్…. త‌న సొంత జిల్లాలో పార్టీని చ‌క్క‌బెట్టే ప‌ని ముందుగా చేప‌ట్టారు. మాజీ ఎమ్మెల్యే, సీనియ‌ర్ నేత ఎర్ర శేఖ‌ర్ తో పాటు టీపీఆర్టీయూ నేత హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రెడ్డి పార్టీలోకి తెచ్చేందుకు రేవంత్ చేసిన మంత్రాంగం ఫ‌లించింది. కానీ త‌న‌ను పార్టీలో చేర్చుకోవ‌ద్దు అంటూ ఎంపీ కోమ‌టిరెడ్డి ఏకంగా రాహుల్ గాంధీకి లేఖ రాశారు. ఈ నెల 12న జిల్లాలో జ‌రిగే స‌మావేశంలో పార్టీలో చేరాల్సిన ఈ ఇద్ద‌రు నేత‌లు త‌మ చేరిక‌ను వాయిదా వేసుకున్నారు. ఎర్ర శేఖ‌ర్ అయితే ఏకంగా ఫోన్ స్విచ్ఛాప్ పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.

పైకి రాహుల్ మీటింగ్ లో చేర్చుకునేందుకే వాయిదా అని రేవంత్ వ‌ర్గం చెప్తున్నా…. కోమటిరెడ్డి తీరుతో రేవంత్ త‌ర‌ఫు నేత‌లు గుర్రుగా ఉన్న‌ట్లు ప్ర‌చారం సాగుతుంది.