కేంద్రంతో డీ అంటే డీ అంటోన్న నేతలకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) నోటిసులు ఇవ్వడం పట్ల ఇదంతా రాజకీయ కక్ష్య సాధింపు చర్యల్లో భాగమనే విమర్శలు వస్తున్నాయి. కష్మీర్ లో ఫరూక్ అబ్దుల్లాను ప్రశ్నించడం, కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అరెస్టు, ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా, అగ్రనేత రాహుల్కు ఈడీసమన్లు జారీ చేయడంతో నెక్స్ట్ ఎవరనే చర్చ జోరుగా జరుగుతోంది.
ప్రస్తుత పరిణామాలను గమనిస్తుంటే ఈడీ నోటిసులు నెక్స్ట్ అందుకునేది కేసీఆరేనని అంటున్నారు రాజకీయ పండితులు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా , రాహుల్ గాంధీలకే ఈడీ నోటిసులు పంపగా..కొంతకాలంగా బీజేపీయేతర ఫ్రంట్ కోసం విశ్వప్రయత్నం చేస్తూ..మోడీ, అమిత్ షా లపై ఒంటికాలిపై లేస్తోన్న కేసీఆర్ కు త్వరలోనే ఈడీ సమన్లు పంపడం ఖాయమని అంటున్నారు.
తెలంగాణలో బలపడేందుకు అన్ని ప్రయత్నాలను చేయాలనీ భావిస్తోంది బీజేపీ అధినాయకత్వం. ఈ క్రమంలోనే కేసీఆర్ అవినీతి అంటూ మాట్లాడుతున్న కమలం నేతలు.. గులాబీ అధినేతకు అవినీతి మరకలు అంటించాలని చూస్తుందని చెబుతున్నారు. ఇందులో భాగంగా ఈడీ నోటిసుల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి.. కేసీఆర్ పై అవినీతి పోరాటం – బీజేపీ విధానం అంటూ ప్రచారం చేసుకోవాలని చూస్తుందన్న విశ్లేషణలు వస్తున్నాయి.