Monday, April 4, 2022
HomePoliticsLatest Newsరేవంత్ ఫోకస్ చేస్తున్న 15 నియోజకవర్గాలివే..?

రేవంత్ ఫోకస్ చేస్తున్న 15 నియోజకవర్గాలివే..?
కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి కొత్త లెక్కలు వేస్తున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 45 నుంచి 48 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలుపుబావుటా ఎగరేస్తుందని ధీమాతో ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చేందుకు అవసరమైన మ్యాజిక్ ఫిగర్ ను చేరుకోవడానికి 60 సీట్లు అవసరం. కనుక ఇంకో 15 నియోజకవర్గాలపై రేవంత్ ప్రధానంగా ఫోకస్ చేస్తున్నారని తెలుస్తోంది.

తుంగతుర్తి

ఇక్కడి నుంచి 2014, 2018లో వరుసగా అద్దంకి దయాకర్ పోటీ చేశారు. కాని బొటాబొటీ మెజార్టీతో టీఆర్ఎస్ అభ్యర్థి గ్యాదరి కిషోర్ పై ఓటమి పాలయ్యాడు. ఈసారి మాత్రం ఎలాగైనా తుంగతుర్తిలో కాంగ్రెస్ జెండా ఎగరేయాలని అద్దంకి కి రేవంత్ సూచించినట్లు తెలుస్తోంది. పైగా వరుసగా రెండుసార్లు ఓటమి చెందటంతో ఆయనపై సానుభూతి వీస్తుంది. దాంతో ఎలాగైనా అక్కడ పట్టు నిలుపుకోవాలని రేవంత్ సూచించారు.

కొడంగల్

2018 ముందస్తు ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసినా రేవంత్ రెడ్డి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. రేవంత్ ను అసెంబ్లీలో కాలు మోపకుండా చేయాలనే లక్ష్యంతో టీఆర్ఎస్ నేతలంతా కలిసి కొడంగల్ లో వాడవాడలా ప్రచారం చేశారు. ధన ప్రవాహం కారణంగా ఆయన స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. కాని ప్రస్తుతం టీఆర్ఎస్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై తీవ్ర వ్యతిరేకత ఉండటం..పైగా రేవంత్ సోదరుడు కాంగ్రెస్ క్యాడర్ కు వెన్నుదన్నుగా ఉండటంతో ఈ స్థానం మరోసారి చేజారిపోకుండా రేవంత్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

మానకొండూర్

రసమయి బాలకిషన్ ప్రాతినిధ్యం వహిస్తోన్న మానకొండూర్ లో ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, పైగా బెదిరింపు రాజకీయాల వలన రసమయి ఇమేజ్ డ్యామేజ్ అవుతోంది. దీంతో అక్కడి నుంచి గతంలో పోటీ చేసినా కవ్వంపల్లిని యాక్టివ్ గా పని చేయాలని రేవంత్ ఆదేశించినట్లుగా తెలుస్తోంది.

కొల్లాపూర్

2018లో కొల్లాపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా హర్ష వర్ధన్ రెడ్డి అనతికాలంలోనే టీఆర్ఎస్ లో చేరిపోయారు.అయితే హర్షవర్ధన్ రెడ్డి చేతిలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలైన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా గులాబీ శిబిరంలో ఉండటంతో టీఆర్ఎస్ కు కాస్త ఇబ్బందికరంగా మారింది. ఇద్దరిలో ఎవరికీ టికెట్ ఇవ్వాలన్న విషయం చర్చకు వచ్చినప్పుడు ఎవరో టీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పెస్తారన్న ప్రచారం జరుగుతోంది. మరోవైపు త్వరలోనే జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ లో చేరుతారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఇక్కడి నుంచి డాక్టర్  కేతూరి వెంకటేష్ లు కాంగ్రెస్ అభ్యర్థుల రేసులో ఉన్నారు. దీంతో ఎలాగైనా కొల్లాపూర్ లో కాంగ్రెస్ జెండా ఎగేసేలా పని చేయాలని స్తానిక నాయకత్వానికి రేవంత్ సూచించారు.

అలంపూర్

అలంపూర్ లోనూ కాంగ్రెస్ కు మంచి పట్టుంది. ఇక్కడి నుంచి టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన అబ్రహం ఇదివరకు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వారే కావడం గమనార్హం. దాంతో ఆలంపూర్ లో సంపత్ ను గెలిపించుకునేందుకు రేవంత్ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నారాయణఖేడ్

నారాయణఖేడ్ నుంచి మహారెడ్డి భూపాల్‌ రెడ్డి (టీఆర్ఎస్) ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఆయన ప్రజలకు అందుబాటులో ఉండటం లేదనే కంప్లైట్ ఉంది. అదే సమయంలో అభివృద్ధిని మరిచారనే ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఇక్కడి నుంచి కాంగ్రెస్ గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయని చెప్తున్నారు.

వనపర్తి

రేవంత్ కు పూర్తి మద్దతుదారుడిగా ఉన్న సీనియర్ నేతలలో మాజీమంత్రి చిన్నారెడ్డి ఒకరు. వనపర్తిలో చిన్నారెడ్డిపై టీఆర్ఎస్ నుంచి బరిలో నిలిచినా నిరంజన్ రెడ్డి స్వల్ప ఆధిక్యతతో గెలుపొందారు. టీఆర్ఎస్ అధినేతకు అత్యంత సన్నిహిత నేతగా ఉన్న నిరంజన్ రెడ్డి కేసీఆర్ క్యాబినెట్ లో కొనసాగుతున్నారు. ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా ఫెయిల్ అయ్యారనే ఆరోపణలు..పైగా స్థానికంగా చిన్నారెడ్డికి క్లీన్ ఇమేజ్ ఉండటంతో ఈసారి చిన్నారెడ్డి గెలుపును రేవంత్ బలంగా కోరుకుంటున్నారు.

జనగాం

టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తోన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఈసారి ఓటమి పాలవ్వడం దాదాపు ఖాయమనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. పలు అవినీతి , అక్రమాల ఆరోపణలతో ఆయనపై తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైంది. దాంతో ఈసారి పొన్నాల ఇలాకాలో కాంగ్రెస్ జెండాను ఎగరేయాలనే కసితో ఉన్నారు రేవంత్.

దుబ్బాక

దుబ్బాక ఎమ్మెల్యే బీజేపీ ఫైర్ బ్రాండ్ రఘునందన్ రావు. అదే స్థానం నుంచి మాజీ కాంగ్రెస్ సీనియర్ నేత చెరుకు ముత్యం రెడ్డి తనయుడు చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. అయితే ఫైర్ బ్రాండ్ గా రఘునందన్ కు పేరున్నా స్థానికంగా మాత్రం అప్పుడే వ్యతిరేకత ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. ఉప ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నేరవేర్చలేదనే అగ్రహంతో ఉన్నారు. ఇదే సమయంలో చెరుకు ముత్యం రెడ్డిపై ఉన్న ఇంప్రెషన్ శ్రీనివాస్ రెడ్డికి కలిసిరానున్నాయి.

వేములవాడ

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచే సీట్లలో వేములవాడ ముందు వరుసలో ఉంటుందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇక్కడి నుంచి గెలిచినా చెన్నమనేని రమేష్ పౌరసత్వంపై ఇంకా పీటముడి నెలకొంది. పైగా స్థానికంగా ఉండరని.. నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోవడం లేదని రమేష్ పై ఆగ్రహంగా ఉన్నారు. ఇది ఆది శ్రీనివాస్ ను గెలుపుకు దగ్గర చేయనున్నది.

ఎల్బీ నగర్

మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఇక్కడి నుంచి బరిలో ఉంటారని ప్రచారం జరుగుతోంది. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినా దేవిరెడ్డి సుదీర్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరారు. ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి ఎంపీగా తనకు మెజార్టీని కట్టబెట్టినా ఈ నియోజకవర్గం నుంచి పోటీలో ఉంటారని ప్రచారం జరుగుతోంది.

అదే సమయంలో.. ఇక్కడి నుంచి మల్ రెడ్డి రంగారెడ్డి కూడా పోటీ చేసీ అవకాశం లేకపోలేదు. పైగా ఇక్కడ కాంగ్రెస్ కు భారీ ఓటు బ్యాంక్ ఉంది.

మేడ్చల్
ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా పోటీ చేసేందుకు హర్ష వర్ధన్ రెడ్డి, తోటకూర జంగయ్య యాదవ్ లు ఆసక్తి కనబరుస్తున్నారు. మరోవైపు మల్లారెడ్డి అవినీతి , అక్రమాలపై పోరాటం చేస్తున్నా రేవంత్ మేడ్చల్ నుంచి బరిలో ఉంటారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అచ్చంపేట

డీసీసీ అద్యక్షుడిగా ఉన్న చిక్కుడు వంశీకృష్ణ ఈసారి అచ్చంపేటలో గెలుపొందటం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక ఎమ్మెల్యే గువ్వల బాలరాజు (టీఆర్ఎస్ ) పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. పైగా వివాదాస్పద నేతగా మారారు ఆయన. అదే సమయంలో రెండుసార్లు వరుసగా ఓటమి పాలైన వంశీకృష్ణ జనాల్లోనే ఉండటం… సానుభూతి కూడా కలిసి రానుండటంతో ఈసారి ఆయన గెలుపు నల్లేరు మీద నడకేనని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఆలేరు

బీర్ల ఐలయ్య ఆలేరు కాంగ్రెస్ ఇంచార్జ్ గా కొనసాగుతున్నారు. ఆర్థికంగా బలంగా ఉన్న ఐలయ్య నిత్యం ప్రజల్లో ఉంటూ.. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పని చేస్తున్నారు. క్యాడర్ చేజారిపోకుండా కాపాడుకుంటున్నారు. వివాదరహితుడిగా పేరుండటం కూడా ఆయనకు కలిసొచ్చే పరిణామంగా చెప్పొచ్చు.

షాద్ నగర్

షాద్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు వీర్లపల్లి శంకర్. ప్రస్తుతం ఎమెల్యేగా కొనసాగుతున్న అంజయ్య యాదవ్ పై వ్యతిరేకత మొదలవ్వడంతో ఇది వీర్లపల్లి శంకర్ కు కలిసిరానుంది. పైగా ఆర్థికంగా సంపన్నుడైన నేత కావడంతో షాద్ నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొంది శంకర్ మొదటిసారి చట్టసభల్లోకి వెళ్ళడం ఖాయమని స్థానికంగా ప్రచారం జరుగుతోంది.

దీంతో  ఈ పదిహేను నియోజకవర్గాలను రేవంత్ ప్రధానంగా మానిటరింగ్ చేస్తున్నారని…గెలుపు గర్వంతో నిర్లక్ష్యం వహించవద్దని అక్కడి నేతలకు సూచనలు చేశారు.

Prashanth Pagilla
Prashanth is working for Telanganaposter.com since 3 years. He did his Journalism in Andhra Pradesh and is now working on Politics, Sports and Latest News.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments