తెలంగాణలో ముందస్తు ఎన్నికలుంటాయా..?షెడ్యూల్ మేరకే ఎన్నికలు జరుగుతాయా..? అనే విషయంలో కేసీఆర్ క్లారిటీ ఇచ్చినా టీఆర్ఎస్ సహా విపక్షాలు సైతం సీఎం వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవడం లేదు. ముందస్తు వ్యూహంలో భాగంగా ప్రతిపక్షాలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ఉండేందుకుగాను కేసీఆర్ ఈ కామెంట్స్ చేసి ఉంటారని భావిస్తున్నాయి.
ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని ప్రధాన పార్టీలన్నీ పొత్తులు లేకుండానే బరిలోకి దిగనున్నాయి. గతంలోనే పొత్తుల కోసం అర్రులు చాచి ఎన్నికల్లో కాంగ్రెస్ చావుదెబ్బతిన్నది. గెలవాల్సిన సీట్లను కూడా కోల్పోయింది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని మరోసారి పొత్తులు పెట్టుకోవద్దని హస్తం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పర్యటనకు వచ్చిన రాహుల్ గాంధీ వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఉండవని తేల్చిపారేశారు.
గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన బీజేపీ 100కు పైగా సీట్లలో డిపాజిట్ కోల్పోయింది. టీడీపీతో పొత్తులున్నప్పుడు నాలుగైదు ఎమ్మెల్యే సీట్లను గెలిచే కమలం పార్టీ.. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. కాని బండి సంజయ్ పార్టీ అద్యక్షుడు అయ్యాక పార్టీ కొంతమేరకు బలోపేతం అయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుంటుందా అన్నది కూడా అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీది కూడా ఒంటరి పోరాటమేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అధికార టీఆర్ఎస్ కు మజ్లిస్ స్నేహపూర్వక మద్దతు ఇస్తుందనేది బహిరంగ రహస్యమే. ఎడెనిమిది చోట్ల తప్ప ఆ పార్టీ పోటీకి రాదు. మిగిలిన చోటల్లా టీఆర్ఎస్కు మద్దతిచ్చేలా ఒప్పందం జరుగుతుంది. ఇక, తెలంగాణలో ఉనికి ప్రశ్నార్ధకం చేసుకున్న టీడీపీ కూడా ఎదో ఓ పార్టీకి లోపాయికారిగా మద్దతు అందించాల్సిందే. వైఎస్ షర్మిల పార్టీది కూడా దాదాపు ఇదే పరిస్థితి. ఇలా మొత్తానికి అయితే, వచ్చే ఎన్నికల్లో ప్రధాన పార్టీలన్నీ ఒంటరిగానే బరిలోకి దిగడం ఖాయమే.